Mana Vemulawada

వేములవాడ క్షేత్ర చరిత్ర

ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాయమునకు వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట గాని, అతడు కట్టించినందువలన గాని ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది. గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. బద్దేగేశ్వర {భీమేశ్వరా} స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉంది.

వేములవాడ స్థల విశిష్టత

ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం.

కోడెమొక్కు అనే సంప్రదాయం ఆంతర్యం కోడె వృషభ స్వరూపం…వృషభం ధర్మానికి ప్రతిరూపం..అందుకే శివుడు నందివాహనుడు…ధర్మాన్ని అధిరోహించే ఆదిదైవం సదాశివుడు..ఇలా ధర్మస్వరూపమైన లాగదూడతో కలిసి ఆ రాజేశ్వరుడికి ప్రదక్షిణ చేయటం వల్ల సత్ సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం…ఆ పుట్టబోయే సంతానం ధర్మబద్ధులై తరిస్తారని ఇలా కోడెమొక్కులతో రాజేశ్వరానుగ్రహ పాత్రతతో సత్ సంతానాన్ని భక్తులు పొందుతారు…

బద్ది పోచమ్మ